: ఎయిర్ టెల్ తాజా ఆఫర్ తో ఇండియాలో మొదలైన పూర్తి స్థాయి టెలికం వార్!

ఇండియాలో టెలికం కంపెనీల మధ్య పూర్థి స్థాయి యుద్ధం మొదలైంది. తమ మార్కెట్ వాటాను కోల్పోరాదని, మరింతగా పెంచుకోవాలని భావిస్తున్న టెల్కోల్లో ఒకరిని మించిన ఆఫర్లను మరొకరు ప్రకటిస్తున్నారు. రిలయన్స్ జియో రంగప్రవేశంతోనే మూడు నెలల పాటు అపరిమిత ఉచిత డేటా ఇస్తున్నామని సంచలన ప్రకటన చేసినప్పటి నుంచి మిగతా కంపెనీల్లో గుబులు మొదలైంది. ఆ వెంటనే తమ కస్టమర్లను వదులుకునేందుకు ఇష్టంలేని ఐడియా, యునినార్ తదితర సంస్థలు డేటా వాడకం చార్జీలను గణనీయంగా తగ్గించగా, తాజాగా ఎయిర్ టెల్ 3జీ, 4జీ డేటా ధరలను 80 శాతం తగ్గిస్తూ సోమవారం నాడు ప్రకటన వెలువరించింది. ఓ ప్రత్యేక స్కీమును ప్రకటిస్తూ, తొలుత రూ. 1,498తో రీచార్జ్ చేసుకుంటే, సంవత్సరం పాటు రూ. 51కే 1జీబీ 3జీ లేదా 4జీ డేటాను ఎన్నిసార్లయినా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రూ. 259కి 28 రోజులు చెల్లుబాటయ్యేలా 1జీబీ డేటాను ఎయిర్ టెల్ అందిస్తోంది. రిలయన్స్ జియో దూసుకొస్తున్న వేళ, తన కస్టమర్ బేస్ తగ్గుతుందన్న ఆందోళనతోనే ఎయిర్ టెల్ ఈ ఎత్తు వేసిందని ఫిచ్ రేటింగ్ డైరెక్టర్ నితిన్ సోనీ వ్యాఖ్యానించారు. జియో లాంచింగ్ తరువాత, సిమ్ కోసం రిలయన్స్ స్టోర్ల వద్ద కనిపిస్తున్న క్యూలైన్లు ఎయిర్ టెల్ ను కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టి ఉండవచ్చని, అయితే, మూడు నెలల ఫ్రీ సేవల కోసం రిలయన్స్ వైపు చూస్తున్న ఎయిర్ టెల్ కస్టమర్లను, రూ. 1500 చెల్లించాలని, ఆపై తక్కువ ధరకు డేటా ఇస్తామని చెప్పడం ఏ మేరకు నిలుపుతుందో వేచి చూడాలని అన్నారు. ఇప్పుడున్న ఎయిర్ టెల్ డేటా ధరలతో పోలిస్తే కొత్త స్కీమ్ 25 నుంచి 30 శాతం వరకూ తక్కువ ధరలకు లభిస్తుందని, సంస్థ ప్రకటించుకున్నట్టు 80 శాతం తగ్గింపేమీ కాదని వివరించారు. 12 నెలల పాటు 1జీబీ చొప్పున వాడుకున్నా, సంవత్సరం ముగిసేసరికి నెలకు రూ. 175 నుంచి రూ. 180 వరకూ డేటా చార్జీలు పడతాయని లెక్క తేల్చారు. రిలయన్స్ ఇస్తున్న ఆఫర్లతో పోలిస్తే ఇదేమీ పెద్ద ఆకర్షణీయంగా కనిపించడం లేదని అన్నారు. భారత టెలికం రంగంలో సుదీర్ఘ కాలం పాటు సాగనున్న ఆధిపత్య పోరుకు సోమవారం నాటి ఎయిర్ టెల్ డేటా తగ్గింపు ప్రకటన ప్రారంభం మాత్రమేనని టెలికం రంగ నిపుణుడు అవినాష్ గొరక్షాకర్ అభిప్రాయపడ్డారు. ధరల తగ్గింపు మార్కెట్ వాటా నిలిచేందుకు సహకరిస్తుందని, అయితే, స్మార్ట్ ఫోన్లలో నెట్ వాడుతున్న వారితో పాటు, వాయిస్ కాల్స్ ఎక్కువగా చేసే వారిని సైతం రిలయన్స్ జియో టార్గెట్ చేస్తూ సాగుతున్న వేళ మిగతా కంపెనీలు నష్టపోయే అవకాశాలే అధికమని అంచనా వేశారు. ఇదే సమయంలో టెలికం కంపెనీల మధ్య నెలకొన్న వార్ తో కస్టమర్లకు మంచి లాభాలు కలుగుతాయని వివరించారు. రిలయన్స్ సైతం తన కస్టమర్ బేస్ ను పెంచుకున్న తరువాత ధరల పెంపువైపే మొగ్గు చూపక తప్పదని తెలిపారు.

More Telugu News