: నేడు తెలంగాణ శాసనసభ సమావేశాలు... ఒక్క రోజుకే పరిమితం

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అది కూడా కేవలం ఈ ఒక్కరోజే జరుగుతాయి. వినాయకచవితి ఉత్సవాలను పురస్కరించుకుని సమావేశాలను వాయిదా వేసి, వచ్చేనెల మూడో వారంలో వీటిని కొనసాగించనున్నారు. నేటి శాసనసభ సమావేశాల్లో జీఎస్టీ బిల్లును ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. నేటి ఉదయం 11 గంటలకు తెలంగాణ శాసనసభ, మండలి సమావేశమవుతాయి. నేటి సమావేశంలో ప్రశ్నోత్తరాలు ఉండవు. శాసనసభలో సీఎం కేసీఆర్‌, శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జీఎస్టీ బిల్లును ప్రవేశపెడతారు. కీలకమైన జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాలని నిర్ణయించుకున్న కేసీఆర్ అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో నేటి అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డిని ఆహ్వానించారు. గతంలో 1970 ల్లో ఒకసారి ఏజీ శాసనసభకు హాజరు కాగా, ఇది రెండోసారి అవుతుంది. రాజ్యంగపరమైన బిల్లు కావడంతో దీనిపై సందేహాలు తీర్చేందుకు ఆయనను ఆహ్వానించారు. నేటి సమావేశంలో సీఎం కేసీఆర్‌, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, అన్ని పార్టీల ప్రధాన నేతలు ప్రసంగించనున్నారు. తరువాత టీ విరామానంతరం శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించి, జీఎస్టీ బిల్లుపై చర్చను ముగించనున్నారు. దీనికి కేంద్రంలో కాంగ్రెస్ మద్దతు పలకడంతో రాష్ట్రంలో అడ్డుకునే అవకాశంలేదు. ఇక బీజేపీ, దాని మిత్ర పక్షం టీడీపీలు అడ్డుకోవు. టీఆర్ఎస్ కు మజ్లిస్ మిత్రపక్షం కావడంతో తెలంగాణ శాసనసభలో దీనికి ఎలాంటి అడ్డంకులు ఉండవన్న సంగతి తెలిసిందే. అనంతరం ఓటింగ్ లేకుండా జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. ఇలా చేయడం ద్వారా కేంద్రంలో తనకు ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం.

More Telugu News