: ఆరోపణలు చేయడం కాదు...నిరూపించండి: సినీ నటుడు విశాల్

తనపై ఆరోపణలు చేసేవాళ్లు వాటిని నిరూపించాలని దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు విశాల్ సవాల్ చేశాడు. నేడు విశాల్ పుట్టిన రోజు. ఈ నేపధ్యంలో విశాల్ నిన్న స్థానిక ట్రిపుల్‌ కేన్‌ లోని అరిమా సంఘం, ఎంపీఎస్ పాలీ క్లినిక్ నిర్వాహకులతో కలిసి చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పిల్లలు ఎవరైనా వైద్యపరీక్షలు ఉచితంగా చేయించుకుని, ముందులు తీసుకోవచ్చని ప్రకటించారు. ఈ నేపధ్యంలో నడిగర్‌ సంఘంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ సంఘ సభ్యులు కొందరు టీ.నగర్, అబిబుల్లా రోడ్డులోని సంఘ ఆవరణలో ఆందోళనకు దిగారు. వారాహి అనే సంఘ సభ్యుడు సంఘ భవన నిర్మాణం కోసం నిధిని సమకూర్చేందుకు నిర్వహించిన స్టార్స్ క్రికెట్‌ కు సంబంధించి కోట్ల రూపాలు అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై విశాల్ మాట్లాడుతూ, ఆరోపణలు చేసేవారు ఆధారాలను చూపాలన్నారు. గతంలో నడిగర్ సంఘంలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన అన్ని వివరాలను మరో 10 రోజులలో వెల్లడించనున్నామన్నారు. అలాగే తమిళ నిర్మాతల మండలిపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఎలాంటి లేఖ రాలేదని, దీనిపై క్షమాపణలు చెప్పే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News