: మా వారికి కాంగ్రెస్ నప్పదులే: నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య

తన భర్త కాంగ్రెస్ పార్టీలో ఇమడలేరని, ఆ పార్టీ సరైన గమ్యస్థానమని తాను భావించడం లేదని మాజీ క్రికెటర్, బీజేపీకి రాజీనామా చేసిన ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ వ్యాఖ్యానించారు. బీజేపీకి దూరమైన తరువాత సిద్ధూను అటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించగా, ఇంతవరకూ సిద్ధూ మాత్రం ఎటువంటి ప్రకటనా చేయలేదన్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో మాత్రం చర్చలు జరిపారు. సిద్ధూ పెట్టిన డిమాండ్లకు ఆప్ దిగిరాకపోవడం కారణంగానే, ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తోందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన సిద్ధూ భార్య, ఆప్ ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ మ్యానిఫెస్టో బాగుందని, సమర్థుడైన నేత ఉంటే పంజాబ్ లో పార్టీని ముందుకు నడిపించవచ్చని అన్నారు. ఇదిలావుండగా, తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, తన భార్యకు ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వాలని సిద్ధూ డిమాండ్ చేయగా, పార్టీ నియమావళి ప్రకారం, ఒకే ఇంట ఇద్దరికి టికెట్లు ఇవ్వలేమని ఆప్ అధినేత తేల్చి చెప్పడమే సిద్ధూ ఆప్ లో చేరికకు ప్రధాన అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది.

More Telugu News