: చివరి గంటలో హైజంప్ చేసిన సెన్సెక్స్ బుల్!

సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే, నష్టాల్లో ఉన్న బెంచ్ మార్క్ సూచికలు, ఆపై 11 గంటల సమయంలో లాభాల్లోకి వచ్చినప్పటికీ, ఒడిదుడుకుల మధ్య సాగాయి. యూరప్ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు పాజిటివ్ గా ఉండటంతో చివరి గంట వ్యవధిలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో 27,807 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ సూచి, 3:15 గంటలకు 27,915 పాయింట్లకు జంప్ చేసింది. మిడ్ క్యాప్ సైతం మంచి లాభాలను కళ్లజూసింది. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 120.41 పాయింట్లు పెరిగి 0.43 శాతం లాభంతో 27,902.66 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 34.90 పాయింట్లు పెరిగి 0.41 శాతం నష్టంతో 8,607.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.49 శాతం, స్మాల్ కాప్ 0.09 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 33 కంపెనీలు లాభపడ్డాయి. జీ ఎంటర్ టెయిన్ మెంట్స్, టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, రిలయన్స్, హిందాల్కో తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఇన్ ఫ్రా టెల్, టెక్ మహీంద్రా, లుపిన్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,887 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,216 కంపెనీలు లాభాలను, 1,466 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,09,31,650 కోట్లుగా నమోదైంది.

More Telugu News