: ఇంటర్నెట్ వ్యసనపరులకు ‘షాక్’ ట్రీట్‌మెంట్.. చైనా ఆస్పత్రిలో వింత చికిత్స!

ఇంటర్నెట్.. గాలి, నీరు, ఆహారం లేకుండా కూడా కొందరు బతకగలరేమో కానీ ఇది లేకుండా మాత్రం ఈవేళ కొందరు జీవించలేరంటే అతిశయోక్తి కాదేమో. మానవ జీవితాలతో ఇది అంతగా పెనవేసుకుపోయింది. ఒకరకంగా చెప్పాలంటే, కొందరు దీనికి బానిసలుగా మారుతున్నారు. ఇంటర్నెట్ మంచిదా? చెడ్డదా?.. ఈ చర్చను పక్కనపెడితే చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్సులో ఉన్న ఓ ఆస్పత్రి మాత్రం ఇంటర్నెట్ వ్యసనపరులకు ‘షాక్ ట్రీట్‌మెంట్’ ఇస్తూ వారితో ఆ పని మాన్పించేందుకు కొత్త పద్ధతిని కనిపెట్టి ప్రపంచాన్ని అవాక్కయేలా చేసింది. లినిల్‌లోని ‘ఇంటర్నెట్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ సెంటర్’ గురించి తెలిసిన ప్రపంచం షాక్‌కు గురైంది. ఆ సెంటర్‌లో 2006 నుంచి దాదాపు 6 వేల మంది ఇంటర్నెట్ వ్యసనపరులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పేరుతో ఆస్పత్రి చేస్తున్న వైద్యంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్ట్రిక్ షాక్ థెరపీ ద్వారా వారి వ్యసనాన్ని దూరం చేయడమే ఈ ఆస్పత్రి పని. షాక్ థెరపీ గురించి విస్మయ పరిచే నిజాలు వెలుగులోకి వచ్చాక చైనా ప్రభుత్వం 2009లో ఈ సెంటర్‌ను నిషేధించింది. అయితే ఈసారి ‘లో ఫ్రీక్వెన్సీ పల్స్ ఎలక్ట్రానిక్ అక్యుపంక్చర్’ పేరుతో కొత్తరూపంలో వచ్చి ప్రజలను మభ్యపెడుతోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే బాధితుల్లో చాలామందిని వారి కుటుంబ సభ్యులు, బంధువులే చేర్చడం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాలామందికి తమను ఇక్కడ ఎందుకు చేర్చారో, ఏం బాగవాలో అర్థం కాకపోవడం విషాదం. ఇక చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మంది యువతీయువకులే. చాలామంది ఇక్కడి నుంచి తాము బయటపడి ప్రపంచాన్ని చూస్తామని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడితే వారికి జన్మలో ఇంటిముఖం చూసే అవకాశం రాదు.

More Telugu News