: ‘స్వచ్ఛ గంగ’ కోసం చిన్నారి సాహసం.. 550 కిలోమీటర్లు ఈదనున్న 11 ఏళ్ల బాలిక

రోజురోజుకు కలుషితమవుతున్న గంగానదిని పరిరక్షించాలనే ఉద్దేశంతో 11 ఏళ్ల చిన్నారి ఎవరూ చేయని సాహసానికి పూనుకుంది. ‘స్వచ్ఛ గంగ’ నినాదంతో గంగానదిలో 550 కిలోమీటర్లు ఈది ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మరికొన్ని గంటల్లో ఆమె సాహసం ప్రారంభం కానుంది. కాన్పూరుకు చెందిన స్విమ్మింగ్ సంచలనం శ్రద్ధా శుక్లా(11) కాన్పూర్ నుంచి వారణాసికి ఈత ద్వారా 70 గంటల్లో చేరుకోనుంది. కాన్పూరులోని మసాకర్‌ ఘాట్‌ నుంచి ఆమె సాహస యాత్ర ప్రారంభం అవుతుంది. రోజుకు సగటున ఏడుగంటల పాటు ఈది, పది రోజుల్లో 550 కిలోమీటర్లు ప్రయాణించి వారణాసి చేరుకుంటుంది. ఇందులో భాగంగా తొలిరోజు మసాకర్ ఘాట్ నుంచి ఉన్నావ్‌లోని చంద్రికాదేవి ఘాట్ వరకు వంద కిలోమీటర్లు ఈదనున్నట్టు శ్రద్ధ తండ్రి లలిత్ శుక్లా తెలిపారు. ఈ సాహసం చేసిన తొలి బాలికగా శ్రద్ధ రికార్డులకెక్కబోతోంది. 2014లో శ్రద్ధ కాన్పూర్ నుంచి అలహాబాద్ వరకు గంగానదిలో 282 కిలోమీటర్లు ఈదింది. ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తిచేస్తానని శ్రద్ధ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.

More Telugu News