: బ్యాంకర్ల మెడకు ‘మాల్యా’ ఉచ్చు!... కింగ్ ఫిషర్ కు రుణాలిచ్చిన బ్యాంకర్లపై ఎస్ఎఫ్ఐఓ ఆరా!

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారం తాజాగా బ్యాంకర్ల మెడకు చుట్టుకుంది. మొత్తం 17 బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.6 వేల కోట్ల మేర రుణాలను తీసుకున్న విజయ్ మాల్యా ఆ తర్వాత ఆ రుణాల చెల్లింపుపై అంతగా ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో అప్పులు వడ్డీతో క్రమంగా పెరిగి రూ.9 వేల కోట్లకు చేరుకోగా... మాల్యా మాత్రం రుణాలు ఎగవేసి లండన్ చెక్కేశారు. లండన్ శివారులోని తన విలాసవంతమైన ఇంటిలో కులాసాగా జీవిస్తున్న మాల్యా... కోర్టు నోటీసులకు, దర్యాప్తు సంస్థ లేఖలకు ఏమాత్రం స్పందించడం లేదు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) మాల్యాకు రుణాల మంజూరుపై దృష్టి సారించింది. అప్పటికే మాల్యా ఏవియేషన్ సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అప్పుల్లో కూరుకుపోగా... అడిగిందే తడవుగా ఆ సంస్థకు రుణాలు ఎలా మంజూరయ్యాయన్న కోణంలో ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో మాల్యాకు రుణాలిచ్చిన కన్సార్టియంలోని బ్యాంకులకు నాటి సమయంలో చీఫ్ లుగా వ్యవహరించిన వారు, రుణాలు మంజూరు చేసే పోస్టుల్లో కొనసాగిన వారి వివరాలను సేకరించిన ఆ సంస్థ అధికారులు... విచారణకు హాజరుకావాలని వారికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురు బ్యాంకర్లను ఆ సంస్థ విచారించినట్లు కూడా సమాచారం. ఈ విచారణ పూర్తైతే... మాల్యాకు రుణాల మంజూరుకు సంబంధించి లోగుట్టు వెలుగులోకి రానుంది.

More Telugu News