: భారత మహిళా హాకీ జట్టుకు అవమానం!... రియో తిరుగు ప్రయాణంలో రైల్లో కింద కూర్చోబెట్టిన టీటీ!

రియో ఒలింపిక్స్ లో భారత మహిళా క్రీడాకారులు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ లు సత్తా చాటిన నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ లో మరింత మెరుగైన ప్రదర్శన కోసం కేంద్రం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో క్రీడా మంత్రిత్వ శాఖ పక్కా ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. ఇలాంటి కీలక తరుణంలో రియో ఒలింపిక్స్ లో గతంతో పోల్చితే కాస్తంత మెరుగైన ప్రదర్శన ఇచ్చిన మహిళా హాకీ జట్టుకు తీరని అవమానం జరిగింది. రియో నుంచి తిరుగు పయనమైన జట్టులోని కొందరు సభ్యులను భారతీయ రైల్వేలకు చెందిన ఓ టీటీ రైల్లో కింద కూర్చోబెట్టాడు. ఈ మేరకు జాతీయ న్యూస్ ఛానల్ సీఎన్ఎన్-ఐబీఎన్ ఓ సంచలన కథనాన్ని నేటి ఉదయం ప్రసారం చేసింది. ఈ కథనం వివరాల్లోకెళితే... ఒలింపిక్స్ ముగియగానే రియో నుంచి తిరుగు పయనమైన మహిళా హాకీ జట్టులోని కొందరు సభ్యులు... రాంచీ నుంచి రూర్కెలా వెళ్లేందుకు బోకారో-అలెప్పీ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. అయితే వారి ప్రయాణానికి సంబంధించి ముందస్తు రిజర్వేషన్లు లేవట. దీంతో వారిని కింద కూర్చోవాలంటూ టీటీ ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుతం ఈ కథనం దేశవ్యాప్తంగా పెను కలకలమే రేపుతోంది.

More Telugu News