: ‘పట్టిసీమ’ ఇంజినీర్లకు ప్రోత్సాహకాలు!... స్పెషల్ ఇంక్రిమెంట్లు ప్రకటించిన చంద్రబాబు సర్కారు!

నదుల అనుసంధానంలో దేశంలోనే ఏపీ సర్కారు తొలి విజయాన్ని నమోదు చేసింది. గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపి రికార్డు నెలకొల్పిన ఏపీ ప్రభుత్వం... అందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసం వద్ద పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్లు అతి తక్కువ కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేశారు. రాత్రింబవళ్లు కొనసాగిన పనుల్లో ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్ సీ) వెంకటేశ్వరరావుతో పాటు చీఫ్ ఇంజినీర్ రమేశ్ బాబు అక్కడే మకాం వేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో మంచి అనుభవం ఉన్న ఇంజినీరింగ్ అధికారులను రంగంలోకి దించిన వారిద్దరు ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణం నెలల వ్యవధిలోనే పూర్తి కాగా... గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసిపోయాయి. ఇంతటి కీలకమైన పనిని అహర్నిశలు శ్రమించి రికార్డు కాలంలో ప్రాజెక్టును పూర్తి చేసిన సదరు ఇంజినీరింగ్ అధికారులకు ప్రభుత్వం కాస్త ఆలస్యంగానైనా రివార్డులు ప్రకటించింది. ఈఎన్ సీ, సీఈలతో పాటు మరో 10 మంది ఇంజినీరింగ్ అధికారులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లను ప్రకటించింది. నెలకు రూ.2,500 మేర వారి వేతనాన్ని పెంచింది. ఈ మేరకు నేడు ఈ ఇంక్రిమెంట్లను జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారికంగా ప్రకటించనున్నారు.

More Telugu News