: కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి: కోదండరాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని టీజేఏసీ చీఫ్ కోదండరాం సూచించారు. నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించారని ఆయన ఆరోపించారు. బోధన్‌ లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉందని, ఉద్యమ సమయంలో ఇక్కడ తమ ప్రధాన అంశం ఇదేనని ఆయన చెప్పారు. దీనిపై జిల్లా చరిత్రలో నిలిచిపోయే ఉద్యమాన్ని చేపట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం చేస్తుందని ఇంత కాలం వేచి చూశామని అయితే ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. బోధన్‌ చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించగా అందరూ ఫ్యాక్టరీ తెరిపించాలని కోరారని ఆయన చెప్పారు. దీంతో నిజాం షుగర్స్ ను మళ్లీ తెరిపించేందుకు గ్రామగ్రామాన సభలు, సమావేశాలతో ప్రజలను చైతన్యవంతులను చేస్తామని, ధూంధాం, పోస్టర్ల ఆవిష్కరణ, సంతకాల సేకరణ, పుస్తకం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు చేపట్టనున్నామని ఆయన చెప్పారు. అలాగే బోధన్ నుంచి నిజామాబాద్‌ కు, నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌ కు మహా పాదయాత్ర చేపట్టబోతున్నామని ఆయన తెలిపారు. ఈ లోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు.

More Telugu News