: ఇంటర్ చదివి స్టార్టప్ కంపెనీని పెట్టి, రూ. 6,030 కోట్లకు విక్రయించిన ముంబై సోదరులు

తాము నడుపుతున్న చిన్న ఎడ్వర్ టయిజింగ్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీని చైనాకు చెందిన సంస్థకు విక్రయించడం ద్వారా ఇద్దరు ముంబై సోదరులు బిలియనీర్లు అయిపోయారు. వారే 34 సంవత్సరాల దివ్యాంక్ తురాఖియా, అతని అన్న 36 ఏళ్ల భావిన్. ముంబైలోని జుహు, అంధేరీ ప్రాంతాల్లో పెరిగిన వీరు తాము నడుపుతున్న 'మీడియా డాట్ నెట్'ను చైనాకు చెందిన లిస్టెడ్ సంస్థ బీజింగ్ మినెనో కమ్యూనికేషన్ టెక్నాలజీకి 900 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 6,030 కోట్లు) విక్రయించారు. ఇది పూర్తి క్యాష్ డీల్ కావడం గమనార్హం. ప్రపంచ వ్యాపార ప్రకటనల సాంకేతిక రంగంలో ఇప్పటివరకూ యాడ్ మాబ్ ను 750 మిలియన్ డాలర్లు వెచ్చించి గూగుల్ స్వాధీనం చేసుకున్నదే అతిపెద్ద డీల్ కాగా, ఇప్పుడు దాన్ని ఈ ముంబై సోదరులు దాటేశారు. కాగా వీరిద్దరూ వివిధ విభాగాల్లో మొత్తం 11 స్టార్టప్ కంపెనీలను నిర్వహిస్తుండటం గమనార్హం. ఇంతకూ వీరు చదివింది ఏంటో తెలుసా? ఇంటర్ మాత్రమే. బీకాంలో చేరదామని భావించిన ఈ సోదరులు కాలేజీలో చేరి ఆపై మానేశారు. ఇప్పుడు వ్యాపార భారతావనిలో సత్తా చాటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

More Telugu News