: కాశ్మీరం అట్టుడుకుతున్న వేళ కింకర్తవ్యం... మోదీతో మెహబూబా ముఫ్తీ ప్రత్యేక సమావేశం

ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం కాశ్మీర్ లో చెలరేగిన అల్లర్లు ఎంతకూ సద్దుమణగక పోవడంతో, తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై ప్రధాని నరేంద్ర మోదీతో జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రత్యేక చర్చలు జరిపారు. ఈ ఉదయం ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రెసిడెన్సీకి వచ్చిన ఆమె ప్రధానితో సమావేశమై, కాశ్మీర్ లోయలో పరిస్థితిని వివరించారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించిన భద్రతాదళాలు, జమ్మూ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారందరినీ అరెస్ట్ చేసే చర్యలను ప్రారంభించినట్టు మెహబూబా వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని వేర్పాటు వాద నేతలే అశాంతికి కారణమని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండు రోజుల కాశ్మీర్ పర్యటన అనంతరం, మెహబూబా ముఫ్తీని ఢిల్లీకి వచ్చి ప్రధానితో మాట్లాడాలని ఆదేశించిన మీదటే ఆమె వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గడచిన ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా అల్లర్లు చెలరేగుతుండగా, ఇప్పటివరకూ 7 వేల మందికి పైగా పౌరులు, 4 వేల మందికి పైగా సైనికులు, పోలీసులు గాయపడ్డారు.

More Telugu News