: ఐపీఎల్ తరహా రేట్ ఆఫర్లతో అమెరికా క్రికెట్ కు స్పాన్సరర్ల వెల్లువ!

భారత క్రికెట్ జట్టు అమెరికాలో తొలిసారిగా క్రికెట్ మ్యాచ్ లను ఆడనున్న వేళ, ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ ఇండియాకు భారీ ఆదాయం సమకూరనుంది. ఫ్లోరిడాలో నేటి రాత్రి తొలి మ్యాచ్, రేపు మరో మ్యాచ్ వెస్టిండీస్ తో జరగనుండగా, ఇప్పటికే నాలుగు కంపెనీలు స్పాన్సరర్లుగా వ్యవహరించేందుకు డీల్స్ కుదుర్చుకున్నాయి. మరో 10 నుంచి 15 కంపెనీలు స్పాట్ బయ్యర్స్ గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా ఓవర్ల మధ్యలో, వికెట్లు పడ్డప్పుడు వచ్చే వ్యాపార ప్రకటనల్లో పది సెకన్ల స్లాట్ కు రూ. 6 లక్షల నుంచి 6.25 లక్షల వరకూ రేటు పలుకుతోంది. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లలో వ్యాపార ప్రకటనలకు ఇదే తరహా ధర పలికింది. హీరో మోటో, ఎయిర్ టెల్, కార్బన్ మొబైల్స్, వివో సంస్థలు ఇప్పటికే ప్రకటనల స్లాట్లను తీసేసుకున్నాయి. టైటిల్ స్పాన్సర్ గా ఉండేందుకు పేటీఎం డీల్ కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల మధ్య డీల్ కుదిరి ఉండవచ్చని అంచనా. స్టార్ గ్రూప్ రెండు మ్యాచ్ ల ప్రసార హక్కులను రూ. 32 కోట్లు చెల్లించి సొంతం చేసుకోగా, అంతకుమించే సంపాదిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

More Telugu News