: కశ్మీర్ అల్లర్లలో ఆజ్యం పోస్తున్న 400 మంది గుర్తింపు.. అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు

దాదాపు రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న కశ్మీర్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆందోళనలను రెచ్చగొడుతున్న 400 మంది స్థానిక నేతలను గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థలు ఆ జాబితాను కశ్మీర్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించాయి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వారిని అదుపులోకి తీసుకోవాలని కోరాయి. దర్యాప్తు సంస్థలు గుర్తించిన వారిలో పలువురు హిజ్బుల్ ముజాహిదీన్, తెహ్రీక్-ఇ-హురియత్ నేతలు, వేర్పాటు వాది సయ్యద్ అలీ షా గిలానీ, అతడి సంస్థ జమాతే ఇస్లామి సంస్థల పేర్లు ఉన్నాయి. అల్లర్లకు తెగబడాల్సిందిగా స్థానిక యువకులను వీరు రెచ్చగొడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకోవడం ద్వారా అల్లర్లను అణచివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీనగర్ వెళ్లిన హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అల్లరి మూకలను అదుపుచేసేందుకు బలప్రయోగం చేయడం కంటే వాటిని ప్రోత్సహిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. మరికొన్ని రోజుల్లో ఈదుల్ జుహా పండుగ రానున్న నేపథ్యంలో అంతకు ముందే వీరిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2010లో జరిగిన అల్లర్లను కూడా ఇదే వ్యూహంతో అదుపులోకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించాలని భావిస్తోంది.

More Telugu News