: దారుణం... ఆ పిల్లల తల్లి సమాధానం విని షాక్ తిన్న పోలీసులు!

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన దేశరాజధానిలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని సమయ్‌ పుర్ బాద్లీ ప్రాంతానికి చెందిన రోజీ, బబ్లూ దంపతులు స్థానికంగా ఓ చిన్న గదిలో కాపురం వుంటారు. ఈ దంపతులకు అల్కా (8), జ్యోతి (3) అనే ఇద్దరు కుమార్తెలు, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. ఉద్యోగం సద్యోగంలేని బబ్లూ రోజూ తాగి వచ్చి భార్యా, పిల్లల్ని వేధించేవాడు. దీంతో రెండు నెలల క్రితం కుమారుడ్ని వెంటబెట్టుకుని రోజీ ఇంటి నుంచి వెళ్లిపోయింది. పూటుగా తాగి వచ్చే బబ్లూ అల్కా, జ్యోతిలను పట్టించుకునేవాడు కాదు. ఆగస్టు 15 తరువాత అసలు ఇంటికే రాలేదు. దీంతో వారిద్దరూ అనాథలయ్యారు. తండ్రి రాక, తిండి, నీళ్లు లేక, ఆ చిన్న గదిలోనే మలమూత్ర విసర్జన చేస్తూ, ఒళ్లంతా పుండ్లుపడి, గాలి, వెలుతురు అందక అల్కా, జ్యోతి దీనావస్థకు చేరుకున్నారు. వారింటినుంచి వాసన వస్తుండడంతో ఆగస్టు 19న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ గది తలుపులు బద్దలు కొట్టి లోపలున్న పిల్లల దీనస్థితి చూసి తల్లడిల్లిపోయారు. ఆక్సిజన్ అందక చావు అంచులకు వెళ్లిన ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ ప్రస్తుతానికి ఆసుపత్రిలో కొద్దికొద్దిగా కోలుకుంటున్నారు. వారి తల్లిదండ్రుల గురించి ఆరాతీసిన పోలీసులు, ఎలాగోలా వారి తల్లి రోజీ జాడను కనిపెట్టారు. ఆమెకు పిల్లల పరిస్థితి వివరించి ఆసుపత్రికి రావాలని సూచించారు. వారికి ఆమె 'నేనే దిక్కులేని బతుకీడుస్తున్నాను. ఇప్పుడా ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పెంచుకోను? వాళ్లు నాకు వద్దే వద్దు' అని నిష్కర్షగా సమాధానం చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. దీంతో వారి బాధ్యతను స్వీకరించేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ ముందుకొచ్చింది.

More Telugu News