: తమిళనాడులో ఎంబీబీఎస్ సీటు @ 2 కోట్లు!

విద్య అనేది ఈ వేళ చాలా ఖరీదు వ్యవహారమైపోయింది. అందులోనూ ఎంబీబీఎస్ చదవాలంటే కోటీశ్వరుల పిల్లలుగా పుట్టాల్సిందే. సంపాదనతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఆ స్థాయిలో ఉండడంతో వైద్య విద్యకు ఆ డిమాండ్ ఉంది. తమిళనాడులో ప్రైవేటు కళాశాలల్లో వైద్య విద్యనభ్యసించాలంటే కోట్లలో కట్టాల్సిందే. తాజాగా ఏఐపీఎంటీ ఫలితాలు విడుదలైన అనంతరం తమిళనాడు ప్రైవేటు వైద్యవిద్య కళాశాలల్లో ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ట్యూషన్ ఫీజు కోటి రూపాయలు, కాపిటేషన్ ఫీజుగా 85 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జాతీయ స్థాయిలో వైద్య కళాశాలలు ర్యాంకులు, ప్రతిభ ఆధారంగా విద్యార్థులను జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ ను బట్టి ఫీజు ఉండాలి కదా? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. 2014లో చెన్నైలోని ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజీలో ఫీజు 9 లక్షల రూపాయలు ఉండేది. ఆ ఫీజు 2015లో 10 లక్షలకు చేరింది. ఈ ఏడాది మాత్రం 21 లక్షల రూపాయలు అంటున్నారు. అందులో 2 లక్షల రూపాయలు డెవలెప్ మెంట్ ఫీజు, లక్ష కరిక్యులం ఫీజు అంటున్నారు. ట్యూషన్ ఫీజుగా కోటి రూపాయలు, ఇతర ఖర్చులు 25 లక్షల రూపాయలు ఉంటాయని కళాశాల చెబుతోంది. తమిళనాడుకు చెందిన సెల్వగణపతి అనే వ్యక్తి కుమారుడికి నీట్ లో 90 పర్సింట్ కి పైగా మార్కులు వచ్చాయి. 0.25 కటాఫ్ పాయింట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు కోల్పోయాడు. ప్రభుత్వ కళాశాలల్లో అయితే అతను 11,500 రూపాయల ఫీజు చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు తన కుమారుడితో వైద్య విద్యచేయించాలంటే సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News