: మానవత్వం మళ్లీ మంటగలిసింది.. మూటగట్టి, కర్రకు వేలాడదీసి ఓ తల్లి మృతదేహాన్ని మోసుకెళ్లిన వైనం!

నిన్న ఒడిశాలో తన భార్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు డబ్బుల్లేక, భుజాన వేసుకుని ఓ వ్యక్తి 10 కిలోమీటర్లు నడిచిన దృశ్యాలు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల గుండెలను పిండేసిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న మరవకముందే అదే ఒడిశా రాష్ట్రంలో అంత‌కు మించిన‌ మరో దారుణ ఘ‌ట‌న‌ వెలుగుచూసింది. భూమిపై మాన‌వ‌త్వం కొంచ‌మైనా మిగ‌ల‌లేదు అన్న‌ట్లుగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న గురించి వినాలంటే గుండెను రాయి చేసుకోవాల్సిందే. ఓ మ‌హిళ మృతదేహాన్ని కాలితో తొక్కి, సగానికి విరగ్గొట్టి, మూటగట్టి మోసుకెళ్లారు. ఆటోకు డబ్బులు అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేయ‌డం ఎందుకని భావించిన ఆసుప‌త్రి సిబ్బంది ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. రెండు రోజుల క్రితం సోరో ప్రాంతంలో రైలు ఢీ కొట్ట‌డంతో మృతి చెందిన సాలామణి బారిక్(76) అనే వృద్ధురాలికి పోర్టుమార్టం నిర్వ‌హించాల్సి ఉంది. అయితే సోరోలోని ఆసుప‌త్రిలో పోస్టుమార్టం సదుపాయం లేదు. దీంతో ఆమెను రైల్వే పోలీసులు బాలాసోర్‌ ఆసుపత్రికి రైల్లో ఆమె మృత‌దేహాన్ని త‌ర‌లించాల‌నుకున్నారు. దీని కోసం రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ రైల్వే స్టేష‌న్‌కి ఆ వృద్ధురాలి మృత‌దేహాన్ని త‌ర‌లించాల్సి ఉంది. అంబులెన్స్ అందుబాటులో లేదు. ఆ మృత‌దేహాన్ని అక్క‌డ‌కు తరలించాలని హెల్త్‌కేర్‌ సెంటర్‌ స్వీపర్లను కోరారు. అయితే వాహ‌నంలో తీసుకెళ్లడానికి డ‌బ్బులు ఎక్కువ అడుగుతార‌ని భావించిన స్వీప‌ర్లు ఆ మృత‌దేహాన్ని కాలినడకన మోసుకెళ్లాల‌నుకున్నారు. మృతదేహం అప్ప‌టికే బిగుసుకుపోయింది. ఆ మృతదేహాన్ని అలా తీసుకెళ్ల‌డం వీలుకాదని స్వీప‌ర్లు దాన్ని కాలితో తొక్కి, ఎముకలు విరిచి ప్లాస్టిక్‌ బ్యాగులో ఓ మూట‌లా మృత‌దేహాన్ని క‌ట్టారు. అనంతరం కర్రకు వేలాడదీసి స్టేష‌నుకి త‌ర‌లించారు. ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్క‌డంతో ఈ దారుణం బ‌య‌ట‌ప‌డింది. వృద్ధురాలి శవాన్ని సిబ్బంది ఇలా మోసుకెళుతున్న‌ప్ప‌టికీ ఆమె కుమారుడు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉండిపోయాడు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా మీడియాకు చెప్పాడు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర‌ మానవ హక్కుల కమిషన్ ఈ ఘ‌ట‌న‌పై తమకు నివేదిక ఇవ్వాలని పోలీసులను, సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News