: పిన్నెల్లి వర్సెస్ యరపతినేని!... పుష్కరాల్లో అవినీతిపై సవాళ్లు, ప్రతిసవాళ్లు!

కృష్ణా పుష్కరాలు ముగిశాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అశేష భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణమ్మలో పుష్కర స్నానమాచరించి తరించారు. అయితే, పుష్కరాల కోసం ఏపీ సర్కారు చేసిన భారీ ఏర్పాట్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ విపక్షం వైసీపీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై చంద్రబాబు సర్కారు కూడా ఘాటుగానే స్పందించింది. వెరసి పుష్కరాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు మారు మోగాయి. ఇక పుష్కరాలు రెండు రోజుల క్రితం ముగిశాయి. అయినా ఈ విమర్శలు, ప్రతివిమర్శలకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి. జిల్లాలోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైసీపీ), గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు(టీడీపీ)ల మధ్య ఈ తరహా పరిస్థితి నెలకొంది. పుష్కర ఏర్పాట్లలో అవినీతిని నిరూపిస్తానంటూ పిన్నెల్లి చేస్తున్న వ్యాఖ్యలకు యరపతినేని కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. అవినీతిని నిరూపిస్తే యరపతినేని రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని పిన్నెల్లి సవాల్ విసిరారు. ఈ సవాల్ కు ఏమాత్రం వెనక్కు తగ్గని యరపతినేని.. బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ప్రతి సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు ఈ నెల 29వ తేదీని యరపతినేని ఖరారు చేశారు. మరి ఆ రోజు ఏం జరుగుతుందో చూడాలి.

More Telugu News