: నయీమ్ తో కలిసి దందా నడిపిన 'ఐటెన్' టీవీ చానల్ సీఈఓ హరిప్రసాద్ రెడ్డి అరెస్ట్

గ్యాంగ్ స్టర్ నయీమ్ కు అనుచరుడిగా ఉండి, ఎన్నో దందాల్లో పాలు పంచుకున్న ఐటెన్ టీవీ చానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరిప్రసాద్ రెడ్డిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చానల్ ఏర్పాటుకు నయీమ్ తో చేతులు కలిపి పలు సెటిల్ మెంట్లలో హరిప్రసాద్ పాల్గొన్నాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. హరిప్రసాద్ ను నాలుగు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆపై విచారణ జరిపి ఆయన అరెస్టును అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లోని చానల్ కార్యాలయంలో ఉన్న రూ. 13.50 లక్షల విలువైన కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గత సంవత్సరం నల్గొండలోని ప్రకాశం బజారులో నయీమ్ అనుచరుల ఆధ్వర్యంలో ఏర్పాటైన వినాయక విగ్రహం గురించి పేపర్లు, టీవీ చానళ్లలో ప్రచారం చేసేందుకు 80 మంది విలేకరులు, కెమెరామెన్లకు రూ. 80 వేలను, టైటాన్ గడియారాలను ఇచ్చాడని తమ విచారణలో వెల్లడైనట్టు నల్గొండ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. కాగా, ఐటెన్ చానల్ త్వరలో ప్రారంభానికి సిద్ధంకాగా, తాజా పరిణామాలతో పదుల కొద్దీ ఉద్యోగులు వీధిన పడాల్సిన పరిస్థితి నెలకొంది.

More Telugu News