: యువకుడి గుండెలపై మోదీ, చౌహాన్ పచ్చబొట్టు.. ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించిన ఆర్మీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై అభిమానంతో ఓ యువకుడు వేసుకున్న పచ్చబొట్టు ఇప్పుడతనికి ఉద్యోగం రాకుండా చేసింది. ఆర్మీ సెలక్షన్ క్యాంపులో అన్ని పరీక్షలు పూర్తిచేసుకున్నా గుండెలపై ప్రధాని, సీఎంల పచ్చబొట్టులు చూసిన అధికారులు యువకుడికి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో యువకుడు ఆవేదన చెందుతున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టికమ్‌గఢ్ జిల్లాకు చెందిన సౌరభ్ బల్గైయాన్(23) ఆర్మీలో చేరేందుకు చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు ప్రయత్నాలు చేసినా ఏదో ఒక కారణంతో తనకు ఉద్యోగం రాలేదని, ఈసారి టాటూ కారణంగా ఉద్యోగం కోల్పోయానన్నాడు. ఛాతీ కొలతలు తీసుకుంటున్న సమయంలో గుండెలపై ఉన్న ఫొటోలను చూసిన అధికారులు ఉద్యోగానికి అనర్హుడనని చెప్పారని వాపోయాడు. టాటూ కింద ‘సూర్యచంద్రులు ఉన్నంత కాలం శివరాజ్ మామ, మోదీ మామ ఉంటారు’ అని రాసుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదలనని వారిద్దరినీ కలిసి తన ఆవేదన వ్యక్తం చేస్తానని సౌరభ్ తెలిపాడు. 2014లో పుణెలో నిర్వహించిన ఆర్మీ క్యాంపులో ఒకసారి, అనుపూర్, గునా ఆర్మీ క్యాంపుల్లో మరోసారి వివిధ కారణాలతో అర్హత సాధించలేకపోయానని పేర్కొన్న సౌరభ్.. ఈసారి అన్ని అర్హతలు సాధించినా పచ్చబొట్టు కారణంగా ఉద్యోగం నిరాకరించారని పేర్కొన్నాడు. కాగా మోదీ, శివరాజ్ సింగ్‌లపై అభిమానంతో ఫిబ్రవరి 2014లో సౌరభ్ టాటూ వేయించుకున్నాడు.

More Telugu News