: 'కిర్లోస్కర్' ఎండీ తనయుడి కిడ్నాప్... ఉరుకులు పరుగులు పెట్టిన బెంగళూరు పోలీసులు... కథ సుఖాంతం!

కిర్లోస్కర్ కంపెనీ ఎండీ వినాయక్ బాపట్ కుమారుడు ఇషాన్ బాపట్ కిడ్నాప్ వ్యవహారం బెంగళూరు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఇషాన్ (19) నిత్య మీనాక్షీ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్నాడు. బైక్ సర్వీసింగ్ కు ఇవ్వడంతో నిన్న సాయంత్రం ఐదున్నరకు బీఎంటిసి బస్సులో ప్రయాణిస్తూ యెలహంక వద్ద బస్సు దిగాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఇషాన్‌‌ ను బలవంతంగా ఎక్కించుకుని తీసుకుపోయారు. ఆ తరువాత ఏడు గంటలకు ఇషాన్ తల్లికి ఫోన్ చేసి ఇషాన్‌ ను కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈ విషయం పోలీసులకు చెబితే ఇషాన్ ను చంపేస్తామని బెదిరించారు కూడా. దీంతో ఇషాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఉన్న ఒకే ఒక్క ఆధారమైన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేద్దామంటే సెల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉంది. ఇంతలో వైట్ ఫీల్డ్ ప్రాంతంలో అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ తీసుకున్నట్టు గుర్తించడంతో అక్కడికి వెళ్లారు. కాసేపటికి ఆ సిగ్నల్స్ కూడా మాయమయ్యాయి. దీంతో మళ్లీ ఈ కేసు మొదటికొచ్చింది. పోలీసులు మళ్లీ వేట మొదలు పెట్టారు. బెంగళూరులో సగానికి పైగా పోలీసులు ఇషాన్ ను పట్టుకోవడంలో బిజీగా మారిపోయారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. కిడ్నాపర్లు ఏమనుకున్నారో తెలియదు కానీ, ఇషాన్ ను జనహళ్లి వద్ద వదిలి వెళ్లిపోయారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అయితే ఇషాన్ ను కిడ్నాపర్ల నుంచి తామే విడిపించామని పోలీసులు ప్రకటించడం విశేషం.

More Telugu News