: సుప్రీంకోర్టు ఆదేశాలేమీ చట్టం కాదు: ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు ఆదేశాలేమీ చట్టం కాదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకుని, సామాజిక కార్యకర్త వేసిన కేసు విచారించిన సందర్భంగా కృష్ణాష్టమి వేడుకల నిర్వహణపై సుప్రీంకోర్టు తాజాగా కొన్ని గైడ్ లైన్స్ సూచించింది. మైనర్లను ఈ వేడుకల్లో పాల్గొననివ్వవద్దని, మానవ పిరమిడ్లు 20 అడుగులకు మించిన ఎత్తులో ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఎమ్మెన్నెస్ కార్యకర్తలు పలు చోట్ల ఉల్లంఘించారు. దీనిపై ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రేను ప్రశ్నించగా, మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు తాను సిద్ధమని అన్నారు. మానవ పిరమిడ్ ఎత్తు విషయంలో ఆంక్షలు చట్టమేమీ కాదని, అవి కేవలం ఆదేశాలని ఆయన చెప్పారు. అందుకే తాను మీకు ఇష్టమొచ్చిన ఎత్తులో మానవ పిరమిడ్లు పెట్టుకోండని గోవిందులకు సూచించానని ఆయన అన్నారు. దీంతో థానేలో ఆ పార్టీ కార్యకర్తలు 'నేను చట్టాన్ని ఉల్లంఘిస్తా'నన్న టీ షర్టులు ధరించి మరీ 40 అడుగుల మానవ పిరమిడ్ నిర్మించి, ఉట్టి కొట్టారు.

More Telugu News