: వాళ్లేమైనా పాలు, చాక్లెట్లు కొనేందుకు వెళ్లారా?: కాల్పుల్లో మరణించిన వారిపై కాశ్మీర్ సీఎం ముఫ్తీ కీలక వ్యాఖ్యలు

జమ్మూ కాశ్మీర్ లో నిరసనలకు దిగుతూ, భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన వారిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. వారేమీ పాలు లేదా చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి తిరిగి వెళ్లేందుకు రాలేదని అన్నారు. నిరసనలు తెలుపుతూ పోలీసుల పైకి రాళ్లు రువ్విన వారికే పెలెట్లు, బులెట్ల గాయాలు అయ్యాయని స్పష్టం చేశారు. ఈ ఉదయం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 2010లో భద్రతాదళాల చర్యల్లో పౌరులు హతమైన వేళ, తీవ్ర విమర్శలు చేసిన మీరు, ఇప్పుడు అదే తరహా ఘటనలను ఎలా సమర్ధించుకుంటారని మీడియా అడిగిన వేళ ఆమె స్పందించారు. ఆరేళ్ల క్రితం ఫేక్ ఎన్ కౌంటర్ జరిగిందని, ఆ కారణంగా అల్లర్లు చెలరేగాయని, ఇప్పుడు మాత్రం నిరసనలను దగ్గరుండి ప్రోత్సహించే వర్గాలు తయారయ్యాయని అన్నారు. ఆనాడు ప్రాణాలు కోల్పోయిన వారికి, నేడు మరణించిన వారికి పోలికలు లేవని ముఫ్తీ వెల్లడించారు.

More Telugu News