: యువత చేతుల్లో ఉండాల్సింది మారణాయుధాలు కాదు, వారిని తప్పుదోవ పట్టిస్తోన్న వారిని వ‌దిలిపెట్టం: రాజ్‌నాథ్ సింగ్

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జమ్ముకశ్మీర్‌లో రెండో రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఈరోజు ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీతో స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... వేర్పాటు వాదులు రెచ్చిపోతున్న అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌శ్మీరు వాసుల్లో 95 శాతం మంది శాంతిని కోరుకుంటున్నారని, ఈ విష‌యంపై అన్ని పార్టీలతో చర్చించేందుకు సిద్ధమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. త్వరలో అఖిలపక్ష బృందం కశ్మీర్‌ను సందర్శిస్తుందని, ఇప్ప‌టికే క‌శ్మీర్‌లో 20 ప్ర‌తినిధి బృందాల‌తో చ‌ర్చించామ‌ని తెలిపారు. భారత్ భవిష్యత్తు కశ్మీర్‌తో ముడిపడి ఉందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్ లో శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. క‌శ్మీర్ అల్ల‌ర్ల కార‌కులైన వారి కోసం అన్వేష‌ణ కొన‌సాగుతోందని పేర్కొన్నారు. యువతను తప్పుదోవ పట్టిస్తోన్న వారిని వ‌దిలిపెట్ట‌బోమ‌ని అన్నారు. యువ‌త చేతిలో ఉండాల్సింది రాళ్లు, మార‌ణాయుధాలు కాద‌ని.. క‌లాలు, కంప్యూట‌ర్లు, పుస్త‌కాలు ఉండాల‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News