: వైఎస్ జగన్ గెలుపుపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీలో నిన్న పెను కలకలమే రేగింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆ పార్టీలో కలకలం రేగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి ఎన్నికల్లో గెలుపు విషయంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత జిల్లా కడపలో వైఎస్ జగన్ గెలుపు సులువేనని చెప్పిన ధర్మాన... అదే జగన్ శ్రీకాకుళంలో నిలబడితే మాత్రం గెలుపు అంత ఈజీ ఏమీ కాదని పేర్కొన్నారు. అనుకూలంగా ఓటు వేసే వారి సంఖ్య కడపలో అధికంగా ఉన్నందునే జగన్ తన జిల్లాలో భారీ మెజారిటీతో గెలుస్తున్నారని ధర్మాన తేల్చేశారు. నిన్న సాయంత్రం శ్రీకాకుళంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ధర్మాన కాస్తంత ఆవేశంగానే మాట్లాడారు. ‘‘కడపలో 26 శాతం ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. అలాగే రెడ్లు, క్రిస్టియన్లు, మైనారిటీ వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కడపలో జగనే కాకుండా ఎవరు పోటీ చేసినా గెలవగలరు. అక్కడ నేను పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలవగలను. కుల సమీకరణాల పరంగా వైసీపీకి అనుకూలంగా ఆరు జిల్లాలే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో ఇతర పార్టీలకు ఆకర్షితులైన వర్గాలు అధికంగా ఉన్నందున వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసినా గెలవడం కష్టమే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కుల సమీకరణలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ వెనుకబడిన బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. కాళింగ, కాపు, వెలమ ఇతర సామాజిక వర్గాల ప్రభావం చాలా అధికం. ఇక్కడ ఎవరు పడితే వారు గెలవడం సాధ్యం కాదు. అందుకే జగన్ శ్రీకాకుళం వచ్చి నిలిస్తే గెలవడం ఈజీ కాదు. నేను టీడీపీలో చేరి పోటీకి దిగితే కచ్చితంగా గెలుస్తాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచిన వారిని దగ్గరకు తీసుకోవడం, ఓడిన వారిని దూరంగా పెట్టడం జగన్ కు అలవాటైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జగన్ వైఖరి మారాల్సి ఉందన్నారు.

More Telugu News