: బ్రిటన్ మహిళలు 'అమ్మ' హోదాతో వేతనాలు నష్టపోతున్నారు!

బ్రిటన్ మహిళలు మాతృత్వం పొందడం ద్వారా జీతభత్యాలు, పదోన్నతులు నష్టపోతున్నారుట. బ్రిటన్ మహిళలు ప్రసవం తర్వాత, తిరిగి ఉద్యోగాలకు వెళితే మగవారికి, ఆడవారికి మధ్య వేతనాల్లో భారీ వ్యత్యాసం కనపడుతోందట. ఈ విషయాన్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ స్టడీస్ ఒక నివేదికలో వెల్లడించింది. బ్రిటన్ లో తొలి ప్రసూతి సెలవు అనంతరం ఉద్యోగాలకు తిరిగి వెళ్తున్న మహిళల వేతనాల్లో వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనపడుతోందని, ఈ వ్యత్యాసం బ్రిటన్ లో 33 శాతం ఉందని ఆ నివేదికలో పేర్కొంది. 2003లో స్త్రీ, పురుష ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసం 23 శాతం ఉంది. అయితే, ఆ వ్యత్యాసం ప్రస్తుతం 38 శాతానికి చేరుకుంది. మేనేజర్ పదవులకు ఎంపిక కావాల్సిన మహిళలను సైతం, తల్లులయ్యారన్న కారణంగా ఆయా కంపెనీలు, సంస్థలు సాధారణ ఉద్యోగాలకే వారిని పరిమితం చేస్తున్నాయి. అంతేకాకుండా, ప్రమోషన్ల విషయంలో కూడా వీరికి చేదు అనుభవమే మిగులుతోంది. మరికొంతమంది తల్లులైతే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని నివేదికలో పేర్కొంది. బ్రిటన్ మహిళలు తల్లులైన తర్వాత 20 సంవత్సరాల వారి సర్వీసు కాలాన్ని పరిశీలిస్తే, మగవారికన్నా కేవలం నాలుగేళ్లు మాత్రమే వీరు తక్కువగా పనిచేస్తున్నట్లు తేలింది. అయితే, వేతన వ్యత్యాసాలను గమనించిన బ్రిటన్ ప్రభుత్వం వాటిని సరిదిద్దేందుకు కొన్ని చర్యలను ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్య 250 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న కంపెనీలు స్త్రీ, పురుష ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు, పదోన్నతుల గురించిన ఒక నివేదికను ప్రతి ఏటా ప్రభుత్వానికి సమర్పించాలని, ఈ నిబంధనను 2017 నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. అయితే, స్కాట్లాండ్ లో స్త్రీ, పురుష వేతనాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉందని, ఆ తేడా ఏడాదికి సుమారు పది లక్షల రూపాయల వరకు ఉంటోందని పేర్కొంది. కానీ, ఉత్తర ఐర్లాండ్ లో మాత్రం 2012 సంవత్సరం మినహాయిస్తే, 2010 నుంచి ఇప్పటి వరకు పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ జీతాలున్నాయి.

More Telugu News