: శ్రీశైలంలో మరింత తగ్గిన నీరు!... 872 అడుగులకు పడిపోయిన నీటి మట్టం!

కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ మరింతగా పడిపోయింది. ఎగువ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. ఫలితంగా లక్షల క్యూసెక్కుల మేర నీరు ఈ జలాశయానికి వచ్చి చేరింది. వెరసి జలాశయంలో నీటి నిల్వ వడివడిగా పెరిగింది. 874 అడుగులకు పైగా నీరు చేరడంతో ఈ ఏడాది శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండుతుందన్న భావన వ్యక్తమైంది. అయితే క్రమంగా వరద ప్రవాహం తగ్గడం, కృష్ణా పుష్కరాల కోసం నీటిని తప్పనిసరిగా కిందకు వదలాల్సి రావడంతో జలాశయంలో క్రమంగా నీటి నిల్వ తగ్గిపోయింది. నేటి ఉదయం 10 గంటల సమయానికి శ్రీశైలం జలాశయంలో 872.1 అడుగుల మేర నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం జలాశయానికి 8 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 23,996 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 150.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

More Telugu News