: పుస్తకాలతో రియోకు దిపా కర్మాకర్!... తిరిగొచ్చిన మరునాడే పరీక్షలకు హాజరు!

రియో ఒలింపిక్స్ లో పతకం సాధించలేకపోయినా అందరి చేతా ప్రశంసలందుకున్న భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కు... క్రీడలంటే ఎంత ఇష్టమో చదువంటే కూడా అంతే ఇష్టం. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్న ఓ ఘటన మొన్న నిన్న వెలుగులోకి వచ్చింది. భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలోనే తొలిసారిగా ఒలింపిక్స్ ఫైనల్ చేరిన దీపా ప్రస్తుతం త్రిపుర యూనివర్సిటీ దూరవిద్యలో ఎంఏ చదువుతోంది. నిత్యం జిమ్నాస్టిక్ కసరత్తులు చేసే దీపా... చదువును ఏనాడూ దూరం చేయలేదు. మొన్న రియో ఒలింపిక్స్ వెళుతున్న సమయంలోనే దీపా తన పుస్తకాలను బ్యాగులో సర్దుకుని మరీ ఫ్లైటెక్కింది. ఇక రియోలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచినా ఆమెకు పతకం దక్కలేదు. దీంతో నిరాశతోనే వెనుదిరిగిన దీపా మొన్న సోమవారమే భారత్ కు చేరుకుంది. ఆ మరునాడు తన ఎంఏ కోర్సుకు సంబంధించి రెండో సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యాయట. దీంతో చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయని దీపా.. రియో నుంచి తిరిగివచ్చిన మరునాడే పరీక్షలకు వెళ్లిపోయింది. పరీక్ష హాల్లో దీపాను చూసిన అధ్యాపకులు, సాటి విద్యార్థులు చదువు పట్ల ఆమెకున్న ఆసక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

More Telugu News