: చైనా హెచ్చరికకు భారత్ దీటైన జవాబు.. ఏం చేయాలో తమకు తెలుసన్న ఇండియన్ ఆర్మీ

చైనా హెచ్చరికలకు భారత్ దీటైన సమాధానమిచ్చింది. తామేం చేయాలో ఒకరు చెప్పాల్సిన పనిలేదని, తమకు తెలుసని చురకలంటించింది. అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను భారత్ మోహరిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఉలిక్కిపడిన చైనా, అదే కనుక జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. చైనా హెచ్చరికలపై మండిపడిన భారత్ తమ భూభాగం, భద్రతకు సంబంధించి ఉన్న ముప్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం తప్ప ఎవరి కోసమో కాదని తేల్చి చెప్పింది. ‘మా భూభాగం, మా భద్రతకు పొంచి ఉన్న ముప్పుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. క్షిపణులు, ఆయుధాలను మా భూభాగంలో ఎక్కడ మోహరించాలన్న విషయాన్ని చైనా ప్రభావితం చేయజాలదు’’ అని ఆర్మీ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. భారత్ ఆత్మరక్షణ అవసరాలకు మించి సూపర్ సోనిక్ క్షిపణులను మోహరిస్తోందని, టిబెట్, యున్నాన్ ప్రావిన్సులే లక్ష్యంగా ఈ పనిచేస్తోందంటూ చైనా ఆర్మీ తన అధికారిక పత్రిక పీఎన్ఏ డైలీలో పేర్కొన్న విషయం తెలిసిందే. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులంటే చైనాకు మొదటి నుంచీ వణుకే. వీటిని జలాంతర్గాములు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, భూతలం నుంచి కూడా ప్రయోగించే వీలుండడమే ఇందుకు కారణం. 300 కిలోల అణువార్‌హెడ్లను మోసుకెళ్లగలిగే ఈ క్షిపణులు 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునియలు చేయగలవు. కాగా భారత సైన్యం బ్రహ్మోస్ అధునాతన క్షిపణులతో ప్రత్యేకంగా ఓ రెజిమెంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.4,300 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రెజిమెంట్‌లోని వంద క్షిపణులు ఎప్పుడూ ప్రయోగానికి సిద్ధంగా ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న చైనాకు కంటిమీద కునుకు కరవైంది. దీంతో హెచ్చరికల రూపంలో భారత్‌ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

More Telugu News