: 810 కోట్లు ఖర్చు చేస్తే మనకొచ్చినవి ఒక రజతం, ఒక కాంస్యం!

సుమారు 130 కోట్ల జనాభా కలిగిన భారతావనిలో రియో ఒలింపిక్స్ లో గెలుచుకున్నది కేవలం రెండంటే రెండే పతకాలు. ఇందు కోసం భారత ప్రభుత్వం చేసిన ఖర్చు 810 కోట్ల రూపాయలంటే ఆశ్చర్యం కలగక మానదు. నాలుగేళ్ల కాలంలో క్రీడల కోసం అంటే శిక్షణా సెంటర్లు, కోచ్ లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం 750 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు చేయగా, నేషనల్ స్పోర్ట్స్ డెవలెప్ మెంట్ ఫండ్ ద్వారా 22.7 కోట్ల రూపాయలు, టార్గెట్ ఒలింపిక్ పోడియం ద్వారా 38 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో మొత్తం క్రీడల కోసం నాలుగేళ్ల కాలంలో భారత ప్రభుత్వం 810.7 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేస్తే భారత్ కు వచ్చిన పతకాలు కేవలం రెండంటే రెండే. ఇదే సమయంలో ఒలింపిక్స్ లో పతకాల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న బ్రిటన్ 3,082 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేసినందుకుగాను ఆ దేశ క్రీడాకారులు మొత్తం 67 పతకాలు సాధించారు. అంటే సగటున ఒక్కో పతకం కోసం 41 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదే సమయంలో భారత్ మాత్రం ఒక పతకం కోసం 405 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇన్ని పతకాలు తెచ్చినా బ్రిటన్ వాసులు సంతోషపడడం లేదు. వీరికి పతకాల సాధన పేరుతో చేసిన ఖర్చు ట్యాక్స్ పేయర్లపై ఎంతపడిందో తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారుడు ఒక్కొక్కరు ఒలింపిక్స్ లో పోటీ పడ్డ క్రీడాకారులపై ఏడాదికి 1,090 రూపాయలు వెచ్చించినట్టు చెబుతోంది.

More Telugu News