: ఎదురు దాడి ప్రారంభించిన టీఆర్ఎస్!... నయీమ్ ను పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్సేనని విసుర్లు!

గ్యాంగ్ స్టర్ నయీమ్ తో టీఆర్ఎస్ నేత, తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కు సంబంధాలున్నట్లు వార్తలు రావడం, వ్యాపారి నాగేంద్ర ఫిర్యాదుతో భువనగిరి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదుతో డైలమాలో పడిపోయిన టీఆర్ఎస్ ఒక్కసారిగా ఎదురు దాడి ప్రారంభించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గాదరి కిశోర్, పూల రవీందర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మూకుమ్మడి దాడి ప్రారంభించారు. నయీమ్ ను పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలేనని వారు విరుచుకుపడ్డారు. నయీమ్ తో టీఆర్ఎస్ నేతలకే సంబంధాలున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన ఆరోపణలను కేంద్రంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ ఒళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రాజేశ్వరరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చామన్న గాదరి కిశోర్... దళిత ఎమ్మెల్యేలపై అసత్య ఆరోపణలు చేస్తే అట్రాసిటీ కేసులు పెడతామని హెచ్చరించారు. రాజగోపాల్ ను ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన విరుచుకుపడ్డారు. దమ్ముంటే వాస్తవాలు బయటపెట్టాలని గాదరి డిమాండ్ చేశారు. ఉనికి కోసమే కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు. రాజగోపాల్ అక్రమ సంపాదనపై చర్చకు సిద్ధమా? అని వేముల వీరేశం సవాల్ విసిరారు. అక్రమ డబ్బుతోనే రాజగోపాల్ రాజకీయాలు చేస్తున్నారని, గతంలో నయీమ్ పై ఇద్దరు సీఎంలకు తానే ఫిర్యాదు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక పూల రవీందర్ మాట్లాడుతూ కోమటిరెడ్డి సోదరులు దేశంలోనే పెద్ద దొంగలని వ్యాఖ్యానించారు.

More Telugu News