: పాక్ గగనతలం మీదుగా వెళ్లలేం!... కేంద్రానికి పౌర విమానయాన సంస్థల మొర!

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలకు వెళ్లే తమ విమాన సర్వీసులను పాకిస్థాన్ గగనతలం మీదుగా పంపేందుకు భారత పౌర విమానయాన సంస్థలు భయపడుతున్నాయి. భారత్ కేంద్రంగా విమానయాన సేవలు నిర్వహిస్తున్న ప్రైవేటు పౌర విమానయాన సంస్థలు జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్, ఇండిగో సహా ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియా సైతం ఇదే వాదనను వినిపిస్తోంది. ఈ మేరకు ఈ సంస్థలన్నీ వేర్వేరుగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తమ ఆందోళనను వెలిబుచ్చాయి. భారత్, పాక్ ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పాక్ మీదుగా తమ సర్వీసులను నడపలేమని, గుజరాత్ లోని అహ్మదాబాదు మీదుగా నేరుగా గల్ఫ్ దేశాలకు సర్వీసులను నడుపుకునేలా తమకు అనుమతివ్వాలని ఆ సంస్థలు కేంద్రానికి విన్నవించాయి. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన స్పైస్ జెట్... పాక్ గగన తలం మీదుగా కాకుండా అహ్మదాబాదు నుంచి నేరుగా గల్ఫ్ దేశాలకు సర్వీసులు నడిపితే ఒక్కో సర్వీసుకు ఏకంగా రూ.1 లక్ష ఆదా అవుతుందని ఆ సంస్థ తెలిపింది. అంతేకాకుండా కార్బన్ ఉద్గారాల విడుదల కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. కేవలం ఎయిర్ ఫోర్స్, నేవీ విమానాలకు మాత్రమే అనుమతి ఉన్న ఈ రూట్ లో ప్రైవేట్ విమానాల రాకపోకలకు అనుమతించే విషయంపై రక్షణ శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

More Telugu News