: నెరవేరిన కర్నూలు, కడప వాసుల కల!... నంద్యాల- ఎర్రగుంట్ల రైల్వే లైనుకు నేడు సురేశ్ ప్రభు పచ్చజెండా!

రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లా వాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రెండు జిల్లాల మధ్య రైల్వే బంధాన్ని బలోపేతం చేసేదిగానే కాకుండా రెండు జిల్లాల వాసులు నేరుగా విజయవాడకు, తిరుపతికి చేరుకునేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్న నంద్యాల- ఎర్రగుంట్ల రైల్వే లైనుపై నేటి నుంచి రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ రైల్వే లైను ఎట్టకేలకు పూర్తి అయ్యింది. మొత్తం 123 కిలో మీటర్ల పొడవున్న ఈ లైను నిర్మాణం కోసం కేంద్రం ఏకంగా రూ.967 కోట్లను ఖర్చు చేసింది. ఈ రైల్వే లైను అందుబాటులోకి వస్తే కడప జిల్లా వాసులు నేరుగా విజయవాడ చేరుకునే వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా తిరుపతి, చెన్నై వెళ్లేందుకు కర్నూలు జిల్లా వాసులు అనంతపురం జిల్లా మీదుగా సుదూర ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండబోదు. నంద్యాల- ఎర్రగుంట్ల మధ్య పూర్తి అయిన రైల్వే లైనును ఇప్పటికే పరీక్షించిన అధికారులు ప్రారంభోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నేడు విజయవాడ రానున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి ఈ లైనును రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా, ఈ లైను మీదుగా ప్రయాణించే డెమో రైలును కూడా ఆయన ప్రారంభిస్తారు.

More Telugu News