: రోజుకు 56 కిలోమీటర్ల ప్రయాణం, సినిమాలు, విందులకు దూరం: సింధు తల్లిదండ్రులు

ఎనిమిదేళ్ల వయసు నుంచి తమ బిడ్డ సింధు పడ్డ కష్టానికి ప్రతిఫలమే ఈనాటి ఒలింపిక్ పతకమని ఆమె తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన పీవీ రమణ, విజయ దంపతులు తమ బిడ్డ పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకున్నారు. బ్యాడ్మింటన్ లో శిక్షణ కోసం సింధు రోజుకు 56 కిలోమీటర్ల దూరం ప్రయాణించేదని చెప్పారు. సింధూకు పతకం తెచ్చే ప్రయత్నంలో కోచ్ పుల్లెల గోపీచంద్ తన కుటుంబానికి ఎంతో దూరమయ్యాడని చెప్పారు. సింధు ఎంత కష్టపడిందో, అంతకన్నా ఎక్కువగా గోపీచంద్ కష్టించారని, వీరిద్దరూ సినిమాలు, విందులు వినోదాలకు దూరంగా ఉంటూ వచ్చారని తెలిపారు. కనీసం దగ్గరి బంధువుల ఇంట శుభకార్యాలకు కూడా సింధు హాజరు కాలేదని చెప్పారు. ఇష్టమైన ఆహారానికి కూడా దూరమైందని, బ్యాడ్మింటనే తన ప్రపంచం అన్నంతగా మారిపోయిందని తెలిపారు. తెల్లవారుఝామున 3:30 గంటలకు ఆమెను లేపడానికి తమకు ఎంతో ఇబ్బంది అనిపించేదని, అయినా, 'సింధూ.. టైమ్ అయింది' అన్న తమ మాటలు వినగానే 'డాడీ... 5 మినిట్స్' అని చెప్పి, వెంటనే రెడీ అయిపోయి 4 గంటల కల్లా బయలుదేరి అకాడమీకి వెళ్లిపోయేదని ఆమె కష్టాన్ని గుర్తు చేసుకున్నారు.

More Telugu News