: దేశంలోనే మొదటిసారి.. కుష్టు టీకాను విడుదల చేయనున్న ప్రభుత్వం

దేశంలోనే మొట్టమొదటిసారిగా కుష్టు వ్యాధి టీకాను ప్రభుత్వం విడుదల చేయనుంది. దేశీయంగా తయారుచేసిన దీనిని త్వరలో విడుదల చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా తెలిపారు. దీనిని మొదట పైలట్ ప్రాజెక్టు కింద బీహార్, గుజరాత్‌లోని ఐదు జిల్లాల్లో ఉపయోగించనున్నట్టు పేర్కొన్నారు. కుష్టువ్యాధి బ్యాక్టీరియా సోకిన వారు, రోగులతో గడుపుతున్న వారికి ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. దీనివల్ల దాదాపు లక్షమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. మైకోబ్యాక్టీరియం ఇండికస్ ప్రని(ఎంఐఊ) అని పిలిచే ఈ టీకాను పెద్ద ఎత్తున వినియోగించే కార్యక్రమం చేపట్టడం ప్రపంచంలోనే మొదటిసారి అని తెలిపారు. రామకృష్ణ మఠం, సెంట్రల్ లెదర్ రీసెర్చ్, సాక్షం ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిపై నిర్వహించిన జాతీయస్థాయి అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కుష్టువ్యాధి కేసులను మూడేళ్లలో 60 శాతం వరకు ఈ టీకా తగ్గిస్తుందని పరీక్షల్లో తేలినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. శరీరానికి అయిన గాయాలను కూడా ఈ వ్యాక్సిన్ త్వరితగతిన తగ్గిస్తుందన్నారు. ఇది ఒక్క కుష్టు వ్యాధి నివారణకు మాత్రమే కాదని, పలు ఇతర వ్యాధులను నివారించడంలో కూడా సాయపడుతుందని వివరించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ(ఎన్ఐఐ) వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అయిన డాక్టర్ జీపీ తల్వార్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.

More Telugu News