: సుమారు రూ. 1.67 లక్షల కోట్లు చెల్లించేదెలా? ఆర్బీఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ ముందున్న పెను సవాలిదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ గా వచ్చే నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్న ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ముందు ఎన్నో సవాళ్లు నిలిచివున్నాయి. వాటిల్లో ప్రధానమైనది మూడేళ్ల నాడు విక్రయించిన విదేశీ కరెన్సీ బాండ్ల పునర్ చెల్లింపులు రూపాయి ఒడిదుడుకులకు లోనుకాకుండా ఎలా చేయాలన్నదే ప్రధానమైనది. మూడేళ్ల క్రితం డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ గణనీయంగా పతనమైన వేళ, డాలర్ బాండ్లను విక్రయించాలని అప్పటి గవర్నర్ దువ్వూరి సుబ్బారావు నిర్ణయించగా, సుమారు 20 నుంచి 25 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.40 లక్షల కోట్ల నుంచి రూ. 1.67 లక్షల కోట్లు) మరో నెల రోజుల తరువాత, అంటే సెప్టెంబరులో తిరిగి చెల్లించాల్సి వుంది. మూడేళ్ల కాలపరిమితి గల ఈ బాండ్లను విదేశీ ఇన్వెస్టర్లు అప్పట్లో ఎగబడి కొన్నారు. ఇప్పుడు వీటిని తిరిగి చెల్లించాల్సిన వేళ, భారీ ఎత్తున డాలర్లు కరిగిపోనున్నాయి. దీంతో రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో పాటు మార్చి 2017 నాటికి పూర్తి కావాల్సిన బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ శుద్ధి, పెరిగిపోయిన మొండి బకాయిల సమస్యలు ఉర్జిత్ పటేల్ ముందున్న పెను సవాళ్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News