: 22న జిల్లాల ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్... దసరాకి కొత్త జిల్లాల ప్రకటన!: కేసీఆర్

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దసరాకి తెలంగాణలో కొత్త జిల్లాలను ప్రకటిస్తామని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, జిల్లాల ముసాయిదాపై అన్ని పేపర్లలోను ప్రకటనలు ఇస్తామని ఆయన చెప్పారు. వరంగల్, హన్మకొండలను జిల్లాలుగా విభజించమని ప్రజలు కోరితే విభజిస్తాం, ప్రజలు వద్దంటే ఒకే జిల్లాగా ఉంచుతామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను అన్ని రాజకీయపార్టీలు స్వాగతించాయని ఆయన తెలిపారు. అలాగే ఈ జిల్లాల ఏర్పాటుపై వివిధ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాయని ఆయన తెలిపారు. జిల్లాల ఏర్పాటు లోపు మూడుసార్లు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. కొత్త జిల్లాల్లో లక్షా 50 వేల జనాభా ఉంటే అర్బన్ మండలం చేస్తామని ఆయన తెలిపారు. 35 వేల జనాభా ఉంటే రూరల్ మండలంగా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తాము కోరుకున్న విధంగా జిల్లాలు రాని వారు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణలో చేపట్టనున్న ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలకు పెద్దగా అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్ర భౌగోళిక స్వరూపంపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని ఆయన మండిపడ్డారు. ప్రజలకు నీళ్లివ్వాలని కర్ణాటకతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకునేందుకు వెళ్తే... కాంగ్రెస్ నేతలు కుసంస్కారంతో వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు. జోనల్ వ్యవస్థను 1920లో నిజాం ప్రభుత్వం సమయంలో ప్రతిపాదించారని, అప్పట్లో పెద్ద మనుషుల ఒప్పందం తరువాత జోనల్ వ్యవస్థ ఏర్పడిందని ఆయన తెలిపారు. ఇప్పుడు అప్పటి రాష్ట్రమే లేదని, అలాంటప్పుడు జోనల్ వ్యవస్థ కూడా ఉండదని ఆయన తేల్చి చెప్పారు. జోనల్ వ్యవస్థ ద్వారా సీనియారిటీ కోల్పోతామని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, వారి హక్కులకు భంగం కలగకుండా జోనల్ వ్యవస్థను రద్దు చేస్తామని ఆయన తెలిపారు. నయీం కేసులో సిట్ పూర్తి నివేదిక అందజేసిన తరువాత స్పష్టమైన ప్రకటన చేస్తానని ఆయన తెలిపారు. నయీం బాధితులకు వంద శాతం న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. లా అండ్ ఆర్డర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా కటువుగా వ్యవహరిస్తుందని, అరాచకాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఆయన తెలిపారు. తమకు లాలూచీ లేదని, నయీంతో ఎవరికీ సంబంధం లేదని ఆయన చెప్పారు. నయీంను ఎవరైతే పెంచి పోషించారో వారికే భయం ఉంటుందని, వారే సీబీఐ ఎంక్వయరీ లేదా జ్యుడీషియల్ ఎంక్వయరీ కావాలని కోరుతారని ముఖ్యమంత్రి ఆరోపించారు.

More Telugu News