: తెలంగాణలో జలపాతాల హొయలు.. పోటెత్తుతున్న పర్యాటకులు

పాల నురుగులాంటి జలపాతాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. వేగంగా కిందకి జారుతూ హొయలొలికిస్తున్న వాటిని కనులారా వీక్షిస్తూ పర్యాటకులు ఆనందంతో పరవశించిపోతున్నారు. మనసు దోచే ఈ జలపాతాలు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నవి కాదు. అచ్చంగా తెలంగాణలోనే! ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో కళ తప్పిన జలపాతాలు మళ్లీ సందడి చేస్తున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో హోరున కిందికి దూకుతున్న వీటిని చూసేందుకు ఆయా జిల్లాల వాసులే కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి తిలకిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. 150 అడుగుల పైనుంచి పెద్ద శబ్దంతో కిందికి దూకే కడెం నదీ జలాల్లో తడిసి ముద్దయి పోవాలని పర్యాటకులు ఆరాటపడుతున్నారు. ఆ అద్భుత దశ్యాన్ని కెమెరాల్లో బంధిస్తూ మురిసిపోతున్నారు. ఇటీవల వచ్చిన 'రుద్రమదేవి' సినిమాలో కొంత భాగాన్ని ఇక్కడే చిత్రీకరించారు. దుష్యంతుని భార్య శకుంతల ఈ జలపాతంలో స్నానం చేయడంతోనే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. దీనికి సమీపంలోనే బోథ్ మండలంలో పోచేరా జలపాతం ఉంది. 20 మీటర్ల ఎత్తునుంచి కిందికి దూకే గోదావరి ప్రవాహాన్ని చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వారు తరలివస్తున్నారు. నేరెడిగొండలో ఉన్న మరో జలపాతం గాయత్రి. ఇది కూడా పర్యాటకులకు మధురానుభూతులు పంచుతోంది. అలాగే ఖమ్మం జిల్లాలో వాజేడు మండలంలోని బొగత జలపాతం, వరంగల్ జిల్లా కొమ్మలవంచ గ్రామంలోని భీమునిపాదం జలపాతానికి కూడా పర్యాటకులు క్యూ కడుతున్నారు.

More Telugu News