: నిషేధం వార్తతో కుమిలిపోతున్న నర్సింగ్‌ యాదవ్‌!

డోపింగ్ కేసులో ఆరోప‌ణ‌ల‌తో భారత ఫ్ర‌ీస్టైల్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్) నాలుగేళ్ల నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. ప‌ర్య‌వ‌సానంగా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయిన నర్సింగ్ యాద‌వ్.. త‌న‌పై నిషేధం విధించినట్లు తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏడుస్తూనే ఉన్నాడట. ఈ విష‌యాన్ని భారత రెజ్లింగ్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, భాజపా ఎంపీ బీబీ సహ్రాన్‌ సింగ్ తెలిపారు. నర్సింగ్ క‌నీసం మాట్లాడే స్థితిలో కూడా లేడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇది చాలా దురదృష్టకర‌మ‌ని బీబీ స‌హ్రాన్ పేర్కొన్నారు. త‌న‌పై నిషేధం విధించిన అంశంపై స్పందించిన న‌ర్సింగ్.. ఒలింపిక్స్‌లో పాల్గొనాల‌న్న త‌న కలను అన్యాయంగా నాశ‌నం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. తాను అమాయ‌కుడిన‌ని నిరూపించుకుంటాన‌ని, దాని కోసం తాను ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని తెలిపాడు. నర్సింగ్ నిషేధంపై ఆయ‌న‌ సోదరి స్పందిస్తూ, త‌న సోద‌రుడిపై విధించిన నిషేధంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాల‌ని అన్నారు. నిషేధం రద్దు చేయాల‌ని కోరారు. త‌న సోద‌రుడు ఒలింపిక్స్ లో రాణించి స్వర్ణం సాధిస్తాడ‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. న‌ర్సింగ్ కుట్రకు బ‌ల‌య్యాడ‌ని ఆయ‌న త‌ల్లి భులానా దేవి అన్నారు. ఈ వార్త విన్న‌ప్ప‌టి నుంచి త‌న‌ నోట నుంచి మాట రావడం లేదని పేర్కొన్నారు.

More Telugu News