: ఈ సాయం ఏ మూలకు?... కేంద్ర సాయంపై పెదవి విరిచిన చంద్రబాబు!

ఏపీకి ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో నిన్న కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి రూ.1,976 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం, ఏపీ ఆర్థిక లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులు కేటాయించిన కేంద్రం... రాష్ట్రానికి బాసటగా నిలుస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సాయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పెదవి విరిచారు. అంతేకాకుండా కేంద్రం ప్రకటించిన సాయం ఏ మూలకు సరిపోతుందంటూ ఆయన ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. అసలు కేంద్రం ప్రకటించిన నిధుల్లో ఏమాత్రం స్పష్టత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా పుష్కరాల కవరేజీ కోసం విజయవాడ వచ్చిన జాతీయ మీడియా ప్రతినిధులతో నిన్న మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ అని చెప్పి... కేవలం రూ.350 కోట్లు విదిల్చితే ఎలాగంటూ ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉండగా, రూ.450 కోట్లు విడుదల చేస్తే... ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నిధులతో కనీసం కేబుళ్లు కూడా వేసుకోలేమని కూడా ఆయన అన్నారు. రాజ్యసభ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News