: ఒకే భవనంలో పదహారు మతాల ఆలయాల నిర్మాణం!

రష్యాలోని కజన్‌ నగరంలో వివిధ మతాలకు చెందిన పార్థనా మందిరాలు ఒకే భవ‌నంలో ఏర్పాటు చేస్తున్నారు. హిందూ దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా... ఇలా ప్రపంచంలో ప్ర‌సిద్ధి చెందిన‌ 16 మతాలకు చెందిన ప్రార్థ‌నా మందిరాల‌న్నీ ఇక్క‌డ ఒకే చోట చూడొచ్చు. ఇడర్‌ ఖానొవ్‌ అనే ఓ సంఘసంస్కర్త ఈ ఆల‌యాల‌ను ఒకేచోట నెలకొల్పుతున్నాడు. దీనికి ‘టెంపుల్‌ ఆఫ్‌ ఆల్‌ రెలిజియన్స్‌’ అని పేరుపెట్టారు. కజన్‌ నగరంలో మద్యపానం, ధూమపానం మాన్పించే రిహాబిలిటేషన్ కేంద్రాన్ని నిర్వ‌హించే ఇడర్‌ ఖానొవ్‌ ఓ క‌ళాకారుడు కూడా. మతాలన్నిటినీ ఒకే గొడుగు కింద‌కు తీసుకురావాల‌నే ఉద్దేశంతో ఆయ‌న ఈ అద్భుత నిర్మాణాన్ని చేప‌ట్టాడు. ఈ నిర్మాణానికి 1992లో శ్రీకారం చుట్టాడు. ఒకే చోట 16 మందిరాల గోపురాల‌ను చూపిస్తూ భిన్న‌త్వంలో ఏక‌త్వం చూపాల‌ని భావిస్తున్నాడు. భవన నిర్మాణ పనులు చ‌క‌చ‌కా కొన‌సాగుతున్నాయి. ఖానొవ్‌కు విరాళాలు ఇచ్చేవారు పెద్ద సంఖ్య‌లోనే ముందుకు వ‌స్తున్నారు. విరాళాల ద్వారానే ఆయ‌న ఈ భ‌వ‌న‌ నిర్మాణ పనులు కొన‌సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ భవనాన్ని పర్యాటకులు చూసే అవ‌కాశం లేదు. త్వరలోనే ఈ భ‌వ‌న నిర్మాణ‌ పనులు పూర్త‌వుతాయ‌ట‌. ఇందులో ఏ మతానికి సంబంధించిన‌ ప్రార్థనలూ కొన‌సాగ‌వు. సంస్కృతీ సంప్రదాయాలను చూపేందుకు, భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని చాటేందుకు మాత్ర‌మే ఖానొవ్‌ ఈ నిర్మాణాన్ని చేపట్టాడు.

More Telugu News