: నెలసరితో బాధపడుతూ పతకం తేలేకపోయానన్న చైనా క్రీడాకారిణి... వెల్లువలా ఓదార్పు

ఫూ యువాన్హుయ్... మహిళల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ముందు రోజు జరిగిన 4X100 మీటర్ల మెడ్లే రిలేలో చైనా టీంలో భాగంగా పోటీపడింది. ఈ పోటీలో ఆమె సరిగ్గా ఈదలేక పోయింది. ఫలితంగా చైనా టీము నాలుగో స్థానానికే పరిమితమైంది. ఆపై 24 గంటల్లోనే 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ లో పతకాన్ని సాధించింది. ఆపై చైనా మీడియాతో మాట్లాడుతూ, "నిన్న నేను బాగా ఈతకొట్టలేక పోయాను. నా టీమ్ సభ్యులతో కలసి సరితూగలేకపోయాను" అని చెప్పగా, ఏదైనా సమస్యా? అని ప్రశ్నించిన మీడియాకు "నిన్న నాకు పీరియడ్స్ వచ్చాయి. ఆ సమయంలో కనీసం నడవలేను. సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోలేను. అలాంటప్పుడు ఈత కొలనులో దిగాల్సి వచ్చింది." అని ఫూ సింపుల్ గా సమాధానం ఇచ్చింది. నిజాయతీ నిండిన ఆమె సంజాయిషీ చైనాలో వైరల్ అయింది. సామాజిక మాధ్యమాల్లో ఓదార్పు వెల్లువలా మారగా, ఆమెపై కోట్లాది మంది చైనీయులు ఆప్యాయతను కురిపించారు. ఓ బహిరంగ వేదికపై నెలసరి గురించి ఆమె మాట్లాడటాన్ని ఒకరిద్దరు విమర్శించినా అత్యధికులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

More Telugu News