: లడఖ్‌లో ఇండియా ‘చైనా వాల్’.. యుద్ధ ట్యాంకులు, జెట్ ఫైటర్లను మోహరిస్తున్న ఆర్మీ

చైనా విషయంలో ఇండియన్ ఆర్మీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. నిత్యం అప్రమత్తంగా ఉంటూ ఏం జరిగినా వెంటనే స్పందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా లడఖ్‌ సహా అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యూహాత్మక కార్యకలాపాలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈశాన్య ప్రాంతంలో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు, క్షిపణులు, స్పై డ్రోన్ లతో పహారా కాస్తుండగా తూర్పు లడఖ్‌లో దళాలను మోహరిస్తూ ‘వాల్’ నిర్మిస్తోంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల్లో దళాలను మోహరించడం, నిర్మాణాలు చేపడుతుండడంతో భారత్ దానికి దీటుగా బదులిచ్చే చర్యలు చేపట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌ పశ్చిమ సియాంగ్ జిల్లాలోని పాసిఘాట్ అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్(ఏఎల్‌జీ)ని వాయుసేన శుక్రవారం నుంచి పునరుద్ధరించనుంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, తూర్పు ఎయిర్ కమాండ్ చీఫ్ ఎయిర్ మార్షల్ సి.హరి కుమార్ ప్రారంభించనున్నారు. అలాగే అండమాన్ నికోబార్ కమాండ్(ఏఎన్‌సీ)లో పలు నిర్మాణ ప్రాజెక్టులకు ప్రభుత్వం అంగీకరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడంతో అడ్డుకునేందుకు భారత్ సుఖోయ్-30 ఎంఐకే ఫైటర్ జెట్లు, సి-130 జె సూపర్ హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ విమానం పొసైడాన్-81 తదితర వాటిని మోహరిస్తోంది. అయితే అధీనరేఖ వెంట రోడ్డు, రైలు కనెక్టివిటీ లేకపోవడం భారత్‌కు సమస్యగా మారింది. 73 వ్యూహాత్మక రోడ్డు నిర్మాణాల్లో 2012 నాటికి 23 మాత్రమే పూర్తయ్యాయి. అలాగే పలు రైలు మార్గాలు నిర్మించాల్సి ఉంది.

More Telugu News