: పుష్కర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తేడాలుంటే చెప్పండి: యాత్రికులను స్వయంగా ప్రశ్నించిన చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధానికి సమీపంలోని అమరావతిలోని కృష్ణా ఘాట్లలో స్వయంగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యాత్రికుల వద్దకు వెళ్లి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం అమరావతికి వచ్చిన ఆయన, ధరణికోట, ధ్యాన బుద్ధ ఘాట్ కు వెళ్లి, భక్తులతో మాట్లాడారు. పుష్కర ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ప్రశ్నించిన ఆయనకు, చాలా బాగున్నాయని సమాధానం రావడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఏర్పాట్లలో ఏమైనా లోపాలుంటే తనకు చెప్పాలని, వాటిని వెంటనే సరిదిద్దుతానని చంద్రబాబు అన్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు చాలా సేపు వేచి చూడాల్సి వస్తోందని కొందరు యాత్రికులు ఫిర్యాదు చేయడంతో యుద్ధ ప్రాతిపదికన మరిన్ని గదులు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఘాట్ సమీపంలోని నమూనా ఆలయాలను ఆయన సందర్శించారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, పుష్కరాలు ప్రతి ఒక్కరిలో ప్రకృతి పట్ల ప్రేమను పెంచాలని అభిలషించారు. అన్ని శాఖలూ సమన్వయంతో పుష్కరాలను విజయవంతం చేస్తున్నాయని తెలిపారు. వచ్చే కృష్ణా పుష్కరాల నాటికి రాష్ట్రంలో కరవన్న పదం వినిపించకుండా చేయాలని సంకల్పించుకున్నానని వివరించారు.

More Telugu News