: పాక్ స్వాతంత్ర్య వేడుకలను ప్రస్తావిస్తూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాడ్... 10 లక్షల లైకులు, కోట్లాది చీత్కారాలు!

కేరళ కేంద్రంగా ఆభరణాల వ్యాపారం చేస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, ఓ పోటీని పెడుతూ, బంగారం కొనుగోలుకు ఓచర్లను బహుమతిగా ఇస్తామని ఇచ్చిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. కాశ్మీరులో అశాంతికి కారణమై, సరిహద్దుల్లో నిత్యమూ భారత సైన్యం లక్ష్యంగా కాల్పులు జరుపుతూ ఉండే పాక్ దేశాన్ని ప్రస్తావిస్తూ, 'ఇండిపెన్డెన్స్ డే క్విజ్' నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ యాడ్ కు 10 లక్షలకు పైగా లైక్ లు వచ్చినట్టు సంస్థ ఫేస్ బుక్ పేజీలో తెలుస్తోంది. మరెంతో మంది ఈ చర్యను తప్పుబడుతున్నారు. దీనిపై మలబార్ గోల్డ్ మార్కెటింగ్ డైరెక్టర్ అమ్జాద్ హుస్సేన్ స్పందిస్తూ, "మాది అంతర్జాతీయ సంస్థ. గల్ఫ్ దేశాల్లోనూ శాఖలున్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా ప్రకటనలను తయారు చేసే బాధ్యత ఇంటర్నేషనల్ ఏజన్సీకి అప్పగించాం. మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే ఓ వర్గం కస్టమర్ల కోసం దాన్ని తయారు చేశాము" అన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, "గల్ఫ్ మార్కెట్ నే దృష్టిలో ఉంచుకుంటే, అక్కడెంతో మంది మలయాళీలు, భారతీయులు ఉన్నారు. వారినెందుకు ప్రస్తావించలేదు? ఇండియాలోని ఓ పెద్ద సంస్థగా, దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులనూ, ప్రజల సెంటిమెంట్ నూ గుర్తెరగాలి. ఓ భారత సంస్థగా ఈ పని చేసుండకూడదు" అని మైత్రీ ఎడ్వర్టయిజింగ్ డైరెక్టర్ రాజు మీనన్ వ్యాఖ్యానించారు.

More Telugu News