: రికార్డు సృష్టించిన హైదరాబాద్ ఐఐటీ.. రెండేళ్లలో ఒక్క డ్రాపౌటూ లేదు

ఇండియన్ ఇనిస్టిట్యూ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ రికార్డు సృష్టించింది. దేశంలోని డ్రాపౌటే ఎరుగని విద్యాసంస్థగా అవతరించింది. రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క డ్రాపౌట్ కూడా ఐఐటీ హైదరాబాద్‌లో నమోదు కాలేదు. బాంబే, ఢిల్లీ, ఖరగ్‌పూర్, మద్రాస్ ఐఐటీల్లో గత రెండేళ్లలో 1,782 మంది విద్యార్థులు మధ్యలోనే మానేశారు. చిన్నిచిన్న కార్యక్రమాలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఉదయ్ బి.దేశాయ్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్, అండర్ గ్రాడ్యుయేట్స్‌లలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు చాలా కృషి చేస్తున్నట్టు చెప్పారు. చదువు పూర్తిచేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించి చెబుతుండడమే డ్రాపౌట్స్ లేకపోవడానికి కారణమని వివరించారు. అలాగే విద్యార్థులు నిత్యం ఎదుర్కొనే సమస్యలు, సందేహాలను ఫ్యాకల్టీ సభ్యులు తీర్చుతుండడం కూడా ఇందుకు మరో కారణమని పేర్కొన్నారు. ఫస్టియర్ సెమిస్టర్ ఫలితాలు వెల్లడైన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుండడం వల్లే ఐఐటీ హైదరాబాద్‌కు ఈ ఘనత సొంతమైందని దేశాయ్ తెలిపారు.

More Telugu News