: పాక్‌తో చర్చలకు సిద్ధమే.. అయితే షరతులు వర్తిస్తాయి: తేల్చి చెప్పిన భారత్

పాకిస్థాన్‌తో చర్చలకు తాము సిద్ధమని భారత్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో షరతులు వర్తిస్తాయని పేర్కొంది. పాక్ చర్చలకు సిద్ధంగా ఉందంటూ పేర్కొన్న నేపథ్యంలో భారత్ స్పందించింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని, అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే), ఇతర అంశాలపైన మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. చర్చల విషయంలో పాక్ ఆహ్వానంపై స్పందించిన విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మాట్లాడుతూ సమకాలీన అంశాలు, భారత్-పాక్ సంబంధాలు, ఇతర సమస్యలపై చర్చలకు తాము సిద్ధమని పేర్కొన్నారు. బహదూర్ అలీ వంటి ఉగ్రవాదుల చొరబాట్లు, సరిహద్దు టెర్రరిజాన్ని రూపుమాపడం, హఫీజ్ సయీద్, సయ్యద్ సలాహుద్దీన్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదుల పరేడ్లు, ముంబై దాడి ఘటనపై విచారణ, పఠాన్‌కోట్ ఉగ్రదాడి విషయంలో పాకిస్థాన్‌లో దర్యాప్తు.. తదితర అంశాలపైనే చర్చలు ఉంటాయని తేల్చి చెప్పారు.

More Telugu News