: ఇక కూర'గాయాలే'... ధరలు గణనీయంగా పెరుగుతాయి: అసోచామ్ అంచనా

సమీప భవిష్యత్తులో కూరగాయల ధరలు గణనీయంగా పెరగనున్నాయని ఇండస్ట్రీ బాడీ అసోచామ్ అంచనా వేసింది. ఈ సీజనులో గరిష్ఠ దిగుబడి వచ్చే కాలం ముగిసిందని, ఇదే సమయంలో ఏప్రిల్ - జూలై సమయంలో రావాల్సిన దిగుబడి కన్నా తక్కువ దిగుబడే రావడంతో ధరలు 100 శాతం వరకూ పెరిగాయని, అసోచామ్ తన తాజా నివేదికలో తెలిపింది. సీజన్ ముగుస్తున్న వేళ కూరగాయల సాగుపై ఒత్తిడి పెరిగిందని తెలిపింది. కూరగాయల మండీలకు వస్తున్న పంట ఆందోళన కలిగిస్తోందని, రిటైల్, హోల్ సేల్ ధరల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావడ్ వ్యాఖ్యానించారు. సరాసరిన హోల్ సేల్ ధరకు, రిటైల్ ధరకు 52.7 శాతం వ్యత్యాసం కనిపిస్తోందని, కొన్ని నిత్యావసర వస్తు ఉత్పత్తుల ధరలు మరింత వ్యత్యాసాన్ని కలిగివున్నాయని అన్నారు. ముఖ్యంగా బంగాళాదుంపల ధర 2015తో పోలిస్తే, 100 శాతం పెరుగగా, క్యాబేజీ ధర 49.3 శాతం, మిరప ధర 47.8 శాతం, అల్లం ధర 37 శాతం, కాలీఫ్లవర్ ధర 33.9 శాతం, టొమాటో (దేశవాళీ) ధర 26 శాతం, హైబ్రీడ్ వెరైటీ టొమాటో ధర 25.6 శాతం, వంకాయల ధర 20.8 శాతం పెరిగిందని వివరించారు. వంకాయ, టొమాటో ధరల్లో 75 శాతం తేడా కనిపిస్తోందని తెలిపారు. ఏ మేరకు దిగుబడి మార్కెట్ కు రానున్నదన్న విషయమై కనీస ముందస్తు సమాచారం రావడం లేదని ఆరోపించారు.

More Telugu News