: పుష్కరాలకు వచ్చిన భక్తులను సంతృప్తితో పంపాలి: సీఎం చంద్రబాబు

కృష్ణా పుష్కరాలకు వచ్చిన యాత్రికులందరినీ సంతృప్తిగా పంపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పుష్కరాల రెండో రోజు ఏర్పాట్లపై సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 1020 మంది అధికారులు, సిబ్బందితో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పవిత్ర భావనతో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వం బాగా చేసిందన్న భావన ప్రతి ఒక్కరిలో రావాలని, అందుకోసం స్ఫూర్తితో పని చేయాలని, విధి నిర్వహణలో అలక్ష్యం ఉండకూడదని, క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. సిబ్బంది అన్ని ప్రాంతాలకు వెళ్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలిని సూచించారు. నీళ్లలో వ్యర్థాలను తొలగించేందుకు వలలు వినియోగించాలని, పుష్కర్ నగర్ లు, రహదారులపై చెత్త లేకుండా పారిశుద్ధ్య సిబ్బంది చూడాలని అన్నారు. పుష్కర ఘాట్ల వద్ద పారిశుద్ధ్య బాధ్యతలను అగ్నిమాపక సిబ్బంది, నీళ్లలో పారిశుద్ధ్య బాధ్యతలను మత్స్య శాఖ సిబ్బంది చూడాలని అన్నారు. ఎక్కడా వ్యర్థాలు పోగవకుండా చూడాలని, ప్రతి ఘాట్ వద్ద వాటర్ లెవెల్ ఇండికేటర్లు ఏర్పాటు చేయాలని, నీటిమట్టం లోతు తెలిస్తేనే యాత్రికులు అప్రమత్తంగా ఉంటారని, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి చంద్రబాబు సూచించారు.

More Telugu News